: హుస్సేన్ సాగర్ నీటి విడుదల వల్ల లోతట్టు ప్రాంతాలకు ప్రమాదం లేదు!: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్‌లో కురిసిన వర్షాల ధాటికి హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద రోడ్డు కుంగిన విషయం తెలిసిందే. గొయ్యిలా ఏర్పడిన ఆ ప్రాంతాన్ని బాగు చేసే క్రమంలో సిబ్బంది శ్రమిస్తున్నారు. అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ ఇంకా నిండిపోలేదని అన్నారు. నీరు ఎక్కువవడం వల్లే కొంత నీరును విడుదల చేస్తున్నామని చెప్పారు. అయినా అక్కడి నుంచి విడుదల చేసిన నీటితో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం లేదని అన్నారు. అయినప్పటికీ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కవాడిగూడ, అశోక్ నగర్, అంబర్‌పేట్, నల్లకుంట, రాంనగర్ ప్రాంతాల్లో ఈ నీరు చేరే అవకాశం లేదని అన్నారు. నాలాల పక్కన నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో తిరిగి సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.