: హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. స్పీకర్ కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు: రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో టీడీఎల్పీని విలీనం చేయడంపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు న్యాయస్థానం విచారణ జరిపి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు శుభపరిణామమని అన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి టీఆర్ఎస్ అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తాము ఫిర్యాదు చేస్తే స్పీకర్ కార్యాలయం స్పందించలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన 12 మందిని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఉపఎన్నికలకు రావాలని ఆయన సవాలు విసిరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారని హైకోర్టు తీర్పుద్వారా బట్టబయలైందని ఆయన అన్నారు. ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలని హితవుపలికారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం, హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే వాటిని స్పీకర్ కార్యాలయం సమర్థించిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిందని, గతంలో తమ పార్టీకి అనుగుణంగా జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కూడా ఉపయోగించుకొని, ఆ తరువాత ఆయనను కమిషనర్ హోదా నుంచి తీసేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు గుణపాఠమని అన్నారు.