: బరితెగించిన రౌడీ షీటర్... అత్యాచార యత్నం.. బాధితురాలి తండ్రి చేతిలో హతం!


గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కేంద్రం కొల్లూరుకు చెందిన ఆలపాటి నాగరాజుకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో అతని భార్య జయంతి ఎనిమిది మాసాల కిందట పుట్టిల్లు ప్రాతూరులోని తల్లిదండ్రుల చెంతకు చేరింది. వారితో కలిసి జీవిస్తోంది. ఇదే ప్రాంతంలోని కొల్లూరుకు చెందిన రౌడీషీటర్‌ కనపాల నాగరాజు కొల్లూరులోని జయంతి మామ ఆలపాటి ఇస్సాకు వద్దకు వెళ్లి ఆమె చిరునామా చెప్పాలని బెదిరింపులకు దిగి, అతనిని తన బైక్ పైకి ఎక్కించుకుని అర్ధరాత్రి ఆమె గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి వసారాలో మంచంపై నిద్రిస్తున్న జయంతిపై అత్యాచార యత్నానికి దిగాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో, ఆమె తండ్రి బాబూరావు లేచి, అత్యాచారయత్నానికి పాల్పడుతున్న నాగరాజును అడ్డుకుని, కత్తితో దాడి చేశాడు. దీంతో స్వల్పంగా గాయపడిన నాగరాజు బైకుపై అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన బాబూరావు ఇరుగుపొరుగు, బంధువుల సాయంతో అతనిని వెంబడించాడు. ప్రాతూరు నదీతీరంలోని ఓ డొంక వద్ద అతనిని అడ్డుకున్నారు. ఇంటికి వచ్చి మరీ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన నాగరాజుపై ఆగ్రహంతో బాబూరావు కత్తితో మరోమారు దాడిచేశాడు. దీంతో రౌడీషీటర్ కథ ముగిసింది. తనపై కన్నేసిన నాగరాజు గతంలో తన భర్తను వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని, అప్పటి నుంచి తనతో ఉండాలంటూ వేధిస్తున్నాడని, అత్తవారింట్లో అతని వేధింపులు భరించలేకే పుట్టింటికి చేరానని, ఇక్కడ కూడా మనశ్శాంతిగా బతకనివ్వలేదని జయంతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News