: సౌందర్య రజనీకాంత్ రాజీనామా చేయాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు
భారత్ 'యానిమల్ వెల్ఫేర్ బోర్డు' ప్రచారకర్తగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ను నియమించడంపై తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పదవికి సౌందర్య రజనీకాంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, తిరుచ్చిలో 'వీరవిళైయాట్టు మీట్పు కళగం' సంస్థ నిర్వాహకులు ఆందోళన నిర్వహించి, ఆమె చిత్ర పటాలను దగ్ధం చేశారు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధించేందుకు కారణమైన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సౌందర్య పని చేయకూడదన్నది ఆందోళనకారుల ప్రధాన డిమాండ్. గతంలో ఆమె తండ్రి రజనీకాంత్ 'మురట్టుకాళై' చిత్రంలో జల్లికట్టు ఆడి, అంబోతుతో పోరాడి గెలిచినట్లు నటించి తమిళ ప్రజల మనసులో సూపర్ స్టార్ హోదా సంపాదించుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. సౌందర్య రజనీకాంత్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఆమెకు, రజనీకాంత్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.