: రిలయన్స్ లో అట్రిషన్ ను ఆపేందుకు ముఖేష్ అంబానీ ఎత్తుగడ!
భారీ ఎత్తున వ్యాపార విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, కీలకమైన ఉద్యోగులు సంస్థను వీడకుండా చూసేందుకు కొత్త స్కీమ్ ను ప్రకటించారని తెలుస్తోంది. సంస్థలో ఉన్న టాప్-100 ఉద్యోగుల్లో రాజీనామా ఆలోచన రాకుండా చేసేందుకు ఆయన కొత్త ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సగటున రూ. 2 కోట్లకు పైగా వేతనం అందుకుంటున్న వారికి రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల విలువైన రిలయన్స్ వాటాలను ఇస్తామని ఆయన ప్రకటించినట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. మూడేళ్ల పాటు సంస్థలో ఉన్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుందని, కింది స్థాయి ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదని తెలుస్తోంది. ఎలాంటి ఈక్విటీ వాటాలను ఇస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ స్కీమ్ విషయమై రిలయన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. గత రెండేళ్ల వ్యవధిలో పలువురు ఉన్నతోద్యోగులు రాజీనామా చేయడంతో, అదే పద్ధతి కొనసాగితే, విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ముఖేష్ అంబానీ ఈ ఆలోచన చేసి వుండవచ్చని సమాచారం.