: తుని కాపు గర్జనకు హైదరాబాద్ నుంచే సహకారం.. డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేసింది ముద్రగడ కుమారుడే.. వెల్లడించిన సుధాకర్ నాయుడు!
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో నిర్వహించిన కాపు గర్జనకు హైదరాబాద్ నుంచే సహకారం అందినట్టు నెం.1 టీవీ ఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సోమవారం రాజమహేంద్రవరంలో ఆయనను విచారించింది. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కాపు గర్జనకు ముందు ముద్రగడ తనను సంప్రదించి మద్దతు కోరారని తెలిపారు. దీంతో మీడియా పరంగా ఆయనకు తాను సహకరించానని సీఐడీ అధికారులకు తెలిపారు. సభలో వాడిన డ్రోన్ కెమెరాలను హైదరాబాద్‌లోనే కొనుగోలు చేశారని, వాటిని ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారని వెల్లడించారు. అయితే వాటిని స్పాన్సర్ చేసింది మాత్రం ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఎటువంటి సాయం అందించారో కూడా తనకు తెలియదని సుధాకర్ నాయుడు పేర్కొన్నట్టు సమాచారం. కాపుల కోసం ఉద్యమమంటే తాను వెళ్లానని, మాట్లాడేందుకు ఒక్కొక్కరినీ ఆహ్వానించిన ముద్రగడ తర్వాత పట్టాలపైకి రావాలంటూ పిలుపు ఇవ్వడంతో తాను కూడా ఆశ్చర్యపోయానని సుధాకర్ వివరించారు. రైలును తగలబెట్టాలన్న ఉద్దేశం యువకులకు లేదని, వారిని రెచ్చగొట్టడం వల్లే ఈ పనికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ గొడవలో తనకు గాయాలు అయితే చూసేందుకు ముద్రగడ రాలేదని సుధాకర్ నాయుడు సీఐడీ అధికారుల ముందు వాపోయినట్టు తెలుస్తోంది.