: ‘యూరి సెక్టార్’ దాడి.. భారత్ నే నిందించిన ‘పాక్’ పత్రికలు


జమ్మూకాశ్మీర్ లోని యూరి సెక్టార్ పై పాక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహమ్మద్ నిన్న తెల్లవారుజామున చేసిన దాడిలో భారత జవాన్లు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై భారత ప్రధాని, కేంద్ర హోం మంత్రి మండిపడటం విదితమే. అయితే, పాకిస్థాన్ పత్రికలు మాత్రం భారత్ ను నిందిస్తూ, తమ దేశాన్ని సమర్థించుకుంటూ కథనాలు రాశాయి. ఈ దాడి జరిగిన సమయం అనుమానాస్పదంగా ఉందని, అదే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై యూఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడే సమయం ఒకటేనని పాక్ పత్రికల ఎడిటోరియల్స్ ఆరోపించాయి. భారత రాజకీయ, భద్రతా వ్యవస్థ చాలా క్రూరంగా రూపొందించుకున్న దాడులకు నిదర్శనమే యూరీ సెక్టార్ ఘటన అని, ప్రపంచం దృష్టిలో పాకిస్థాన్ ను చెడుగా చూపించేందుకే ఈ దాడులను తమ దేశానికి అంటకడుతోందని ఒక పత్రిక పేర్కొంది. ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రికలో ఒక సీనియర్ మిలిటరీ అధికారి (పేరు చెప్పలేదు) మాట్లాడుతూ, భారత్ కు చెందిన మాజీ ఆర్మీ అధికారులు, రాజకీయనాయకులకు పాకిస్థాన్ పై వేలెత్తిచూపడం అలవాటైందని, అదేవిధంగా ‘యూరీ సెక్టార్’ సంఘటనను కూడా తమ దేశంపై రుద్దుతున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ లో అస్థిరతకు భారత్ యత్నిస్తోందని, ‘యూరి సెక్టార్’ ఘటన ద్వారా పాక్-భారత్ సంబంధాలు ప్రమాదంలో పడే అవకాశముందని, కరాచీకి చెందిన ‘డాన్’ పత్రిక ఎడిటోరియల్ లో రాశారు. పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్ లోకి ఎటువంటి చొరబాట్లు జరగలేదని పాకిస్థాన్ ఆర్మీ మీడియా పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News