: నయీమ్ 20 హత్యలు చేసినట్లు గుర్తించాం.. నాలుగు కేసుల్లో వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులు తప్పుగా ఇచ్చారు: సిట్
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగంగా విచారణ కొనసాగిస్తున్నారు. నయీమ్ 20 హత్యలు చేసినట్లు ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. అందులో నాలుగు హత్యకేసుల్లో వైద్యులు పోస్టుమార్టం నివేదికలు తప్పుగా ఇచ్చినట్లు తేల్చారు. న్యాయస్థానాన్ని మోసం చేసిన వైద్యులను కూడా విచారించాలని సిట్ భావిస్తోంది. మరోవైపు కేసులో రాజకీయనాయకులు, పోలీసుల ప్రమేయంపై మరిన్ని ఆధారాల గురించి ఆరా తీస్తోంది. వారి ప్రమేయం అంశాన్ని అసెంబ్లీ సమావేశాల లోపు తేల్చాలని యోచిస్తోంది. మరోవైపు, నయీమ్ భార్య హసీనా, మేనకోడలు షాదితా షాహిన్‌లను నార్సింగ్ పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు నార్సింగ్ పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు. పుప్పాలగూడలోని నయీమ్ ఇంట్లో యువతి నస్రీన్ హత్యకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎదురు చెప్పిందనే కారణంతో నస్రీన్‌ను నయీమ్ హత్యచేసి మంచిరేవుల వద్ద పాతిపెట్టిన సంగతి తెలిసిందే.