: కేసీఆర్ మొండిఘటమైతే.. బీజేపీ జగమొండి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణకు తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాకతో టీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు సూటిగా స్పందించకుండా ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, మరి, విమోచన దినోత్సవం జరుపుతామని కేసీఆర్ చెప్పిన మాటల చరిత్రను గురించి మాట్లాడాలా..? అని ప్రశ్నించారు. లేక తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాల చరిత్ర గురించి మాట్లాడాలా...? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవ్వకముందు మీరు మాట్లాడిందేంటీ? ఇప్పుడు మాట్లాడుతోందేంటీ? అని కేసీఆర్‌ను లక్ష్మణ్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ను విమోచన దినం గురించి ప్రశ్నించిన మీరు, ఇప్పుడు ఎందుకు చేయలేదని దుయ్యబట్టారు. పార్టీ పరంగా చేసుకొని అధికారికంగా ఎందుకు చేయలేదని అడిగారు. ఎంఐఎం పార్టీ అజెండాకు అనుగుణంగానే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఆయన అన్నారు. ‘కేసీఆర్ ఎవరికీ భయపడరు, మొండిఘటం అంటూ మాట్లాడుతున్నారు. మరి విమోచన దినోత్సవం ఎందుకు జరపలేదు?' అని ఆయన ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్ మొండిఘటమైతే.. బీజేపీ జగమొండి అని లక్ష్మణ్ ఉద్ఘాటించారు.