: పవన్ కల్యాణ్ ను కలిసి అర్థమయ్యేలా చెబుతాం: సుజనా చౌదరి
సినీ హీరో పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో రాష్ట్రానికి కలిగే లబ్ధిని గురించి వివరించనున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. హోదా అన్న పేరు మాత్రమే లేదని, అంతకుమించిన నిధులు ప్యాకేజీ రూపంలో వచ్చాయని విడమరిచి చెబితే, పవన్ సంతోషిస్తారని వ్యాఖ్యానించిన సుజనా, ఈ పనిని తానే స్వయంగా పూర్తి చేస్తానని చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సుజనా, ప్యాకేజీలో ఉన్న ప్రతిఫలాన్ని గమనించిన వారెవరూ దీన్ని వద్దని చెప్పరని, దీన్ని 'స్పెషల్ స్టాటస్ బెనిఫిట్స్ ఇన్ ప్యాకేజ్'గా చూడాలని అన్నారు. ఓ జాతీయ ప్రాజెక్టుకు 100 శాతం నిధులిస్తామని చెప్పడం స్వతంత్ర భారత చరిత్రలో ఒక్క పోలవరం విషయంలోనే జరిగిందని గుర్తు చేశారు.