: సరి'హద్దులు' దాటేద్దాం... పాక్ కు బుద్ధి చెప్పి వద్దాం!
గత సంవత్సరం జూన్ లో నాగా మిలిటెంట్లు మణిపూర్ లో దాడి చేసి 18 మంది భారత జవాన్లను బలి తీసుకున్న వేళ ఏం జరిగిందో గుర్తుందా? మిలిటెంట్లను వెంటాడుతూ వెళ్లిన భారత భద్రతా దళాలు, మయన్మార్ లోకి చొరబడి, మెరుపుదాడి చేసి వారందరినీ మట్టుబెట్టి తిరిగి వచ్చాయి. ఇప్పుడు అదే తరహా దాడిని పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరపాలన్న ఒత్తిడి వస్తోంది. సైన్యాన్ని సరిహద్దులు దాటించి, పాక్ కు బుద్ధి వచ్చేలా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి రావాలన్న ఆలోచన భారత యువతకు వచ్చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పాక్ కు బుద్ధి చెప్పాల్సిందేనని జోరుగా చర్చ సాగుతోంది. నిన్నటి యూరీ ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడి తరువాత ప్రధాని నుంచి రిటైర్ అయిన సైనికుల వరకూ దాడి జరిపిన వారికి శిక్ష పడాల్సిందేనని ముక్తకంఠంతో నినదిస్తున్న సమయంలో, మరికాసేపట్లో రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగే అత్యున్నత సమావేశం కీలకం కానుంది. అయితే, పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలోకి దూసుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తే, పాక్ పాలకులకు గుణపాఠం చెప్పినట్లవుతుందని, భారత్ వైఖరి ప్రపంచానికి తెలుస్తుందని అత్యధికులు భావిస్తున్నారు. అయితే, ఇదేమంత సులువు కాదని వాదిస్తున్న వారూ ఉన్నారు. నాగా మిలిటెంట్లపై దాడి సమయంలో, మయన్మార్ ప్రభుత్వం నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ పాకిస్థాన్ అలా కాదు. భారత సైన్యంపై తన సైన్యాన్ని పురికొల్పి, యుద్ధానికి తెరలేపినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇరుగు పొరుగు దేశాలైన పాక్, చైనాలు రెండూ అణ్వాయుధ దేశాలే. ఒకసారి యుద్ధం మొదలైతే, దాని ప్రభావం చాలా సంవత్సరాలు ఉంటుంది. ఇక భారత సైన్యంలో రహస్యంగా చొరబడి దాడులు చేసి రాగల ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఇదే సమయంలో తాము ఎన్ని దాడులు చేసినా ఇండియా సంయమనం పాటిస్తుందే తప్ప, సైనిక చర్యలకు దిగదన్న భరోసా పాకిస్థాన్ కు ఉంది. ఈ అభిప్రాయం పోవాలంటే, 17 మంది వీరజవాన్ల ప్రాణత్యాగం వృథా కాకూడదంటే, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాల్సిందేనని రక్షణశాఖ నిపుణులు పీకే సెహ్గల్ వ్యాఖ్యానించారు. "భారత్ కు పాకిస్థాన్ చాలా పెద్ద సవాల్ విసిరింది. దాడికి పాల్పడింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. పాకిస్థాన్ సైన్యమే వీరికి అన్ని రకాల సాయం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇది భారత్ పై పాక్ జరుపుతున్న యుద్ధమే. పాకిస్థాన్ నడుపుతున్న ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై దాడి చేస్తే ప్రపంచమంతా మనవైపే నిలుస్తుంది. మనం మౌనంగా స్పందించడం సబబు కాదు. ఆలోచించి ఎలాంటి చర్య తీసుకోవాలంటే, ఇకపై పాకిస్థాన్ నోరు కూడా మెదపకూడదు" అని సెహ్గల్ ఆగ్రహంతో అన్నారు.