: అధ్యక్ష హోదాలో బంధువును తొలగించిన శివపాల్... ములాయం కుటుంబంలో మరో చిచ్చు!


యూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టిన రాజకీయ గందరగోళం ముగిసిందని భావిస్తున్న వేళ, మరో చిచ్చు రేగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో శివపాల్ యాదవ్, తన సోదరుడు రాంగోపాల్ యాదవ్ సమీప బంధువైన అరవింద్ ప్రతాప్ యాదవ్ అనే ఎమ్మెల్సీని, ఇటావా గ్రామ సర్పంచ్ అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి తొలగించారు. భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చినందునే వారిని తొలగించినట్టు తెలిపారు. వీరు ములాయం సింగ్ పై అనుచిత వ్యాఖ్యలను చేశారని సమాజ్ వాదీ పార్టీ కార్యదర్శి ఎస్ఆర్ఎస్ యాదవ్ వెల్లడించారు. వీరి తొలగింపుపై అధినేతకు శివపాల్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుండగా, తనకు దగ్గరివాడైన రాంగోపాల్ యాదవ్ బంధువులను తొలగించడంపై ముఖ్యమంత్రి అఖిలేష్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో అఖిలేష్ బలాన్ని తగ్గించేందుకు శివపాల్ చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఆయన పార్టీ కార్యాలయానికి అధ్యక్ష హోదాలో తొలిసారి వెళ్లిన వేళ, కొందరు సీఎంకు అనుకూల నినాదాలు చేయగా, వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నినాదాలు చేయాలంటే ముందు పార్టీకి, నేతాజీ ములాయంకు చేయాలని చెప్పారు. తాజా పరిణామాలు ఎంతవరకూ వెళతాయో చూడాలి!

  • Loading...

More Telugu News