: పోలీసులు నన్నేమీ చేయలేరు.. రూ.3 లక్షలు ఇస్తావా? తోలు తీసేదా.. వరంగల్‌లో నయా నయీం


ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించిన గ్యాంగ్‌స్టర్ నయీం కిరాతకాలు ఇంకా ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తుండగానే వరంగల్‌లో నయా నయీం దందా ఒకటి తాజాగా బయటపడింది. అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనని, లేదంటే పిల్లలు కిడ్నాప్ అయిపోతారని, పోలీసులు తమను ఏమీ చేయలేరంటూ ఆగంతుకుడు వ్యాపారులను బెదిరిస్తున్నాడు. తరచూ బెదిరింపులు వస్తుండడంతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగుకు చెందిన వ్యాపారికి వారం రోజుల నుంచి తరచూ ఓ ఆగంతుకుడి నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. మొదట పరిచయస్తుడిలా మాట్లాడిన దుండగుడు తర్వాత పిల్లలు ఎక్కడ, ఏ కాలేజీలో చదువుతున్నారు.. తదితర విషయాలు చెబుతూ బెదిరింపులకు దిగాడు. మర్యాదగా రూ.3 లక్షలు ఇవ్వాలని, లేదంటే తోలు తీస్తానని బెదిరించాడు. పిల్లలు మాయం అయిపోతారని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. పోలీసులు తనను ఏమీ చేయలేరని, వారికి చెబితే అంతు చూస్తానని బెదిరిస్తుండడంతో వ్యాపారి భయంతో వణికిపోతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయా నయీం కోసం వేట మొదలుపెట్టారు. అతడి పిల్లల రక్షణ కోసం వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కాగా బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబరు ఖమ్మం జిల్లా సింగరేణి కాలనీ, చాకలివాడకు చెందిన ఓ వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కాల్స్ మాత్రం తూర్పుగోదావరి నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News