: ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు, వెంకయ్యలకు ఎందుకు సన్మానాలు?: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రజలను మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు సన్మానాలు ఎందుకు చేస్తున్నారు? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో ప్రత్యేక హోదా,ప్యాకేజ్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పట్టుబట్టిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు తన అభిప్రాయం మార్చుకున్నారని ఆయన నిలదీశారు. వెంకయ్యనాయుడు తన అభిప్రాయం మార్చుకునేలా చంద్రబాబు చేశారా? రెండున్నరేళ్లలో పరిస్థితులు మారిపోయాయా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నిధులు ఇస్తోందని, ఏపీకి ప్రత్యేకంగా ఇస్తోందేమీ లేదని అన్నారు. ఏపీకి రూ.2 లక్షల 25 వేల కోట్లు ఇస్తున్నామని కేంద్రం చెబుతోందని, ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై వెంకయ్య, చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళతామని విజయసాయిరెడ్డి అన్నారు.