: యూరీ ఉగ్రదాడి పాక్ దుర్మార్గానికి నిదర్శనం: ముక్త కంఠంతో ఖండిస్తున్న నేతలు


ఈ ఉదయం యూరీలోని ఆర్మీ కార్యాలయంపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 17 మంది జవాన్లను బలి తీసుకోవడాన్ని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులది పిరికి చర్యని, ఈ తరహా ఘటనలతో ఐకమత్యంగా ఉండే భారతీయుల్లో చిచ్చు పెట్టలేరని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ఆమె తన సానుభూతిని తెలిపారు. ఆ పార్టీ మరో నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, పాకిస్థాన్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న లోయలో తిరిగి అశాంతిని రగిల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. న్యూఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించి, కాశ్మీర్ సీఎం, గవర్నర్ లతో పాటు రక్షణ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. కాశ్మీర్ లో తాజా పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని చెబుతూ, వారిని ఆదుకుంటామని అన్నారు. పలువురు అధికార విపక్ష నేతలు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ట్వీట్లు పెడుతున్నారు.

  • Loading...

More Telugu News