: నలుగురి ముందూ బహిరంగ సభలో బీజేపీ మహిళా నేత చేయందుకుని 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు
తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ కు నలుగురి మధ్యా 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు కటకటాల పాలయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిన్న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు కోవైలో వైభవంగా జరుగుతున్న వేళ, వానతీ ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన తరువాత పలువురు కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలు దిగారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు వచ్చి, ఆమెతో చెయ్యి కలిపి, ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. దీంతో వానతి ఆశ్చర్యపోగా, చుట్టూ ఉన్న బీజేపీ నేతలు సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతనిని తంజావూరుకు చెందిన 25 సంవత్సరాల ముత్తువేల్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.