: ‘రిటన్ హోమ్ టెస్ట్’లో ఫెయిలవుతున్న తెలుగు వైద్య విద్యార్థులు.. గతేడాది 20 వేల మందిలో 11 శాతం మందే ఉత్తీర్ణత


వైద్య విద్యను అభ్యసించేందుకు విదేశాలు వెళ్లివస్తున్న తెలుగు విద్యార్థుల్లో చాలామంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ)లో ఫెయిలవుతున్నారు. ఫారెన్ మెడికల్ డిగ్రీతో ఇంటికి చేరాలనుకునే విద్యార్థులు ఈ పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులు కావలసివుంది. గతేడాది 20 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా కేవలం 11 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడం గమనార్హం. భారత్‌లో మెడిసిన్ చదివేందుకు సీటు లభించని వారు విదేశాలు వెళ్తున్న సంగతి తెలిసిందే. విద్యాప్రమాణాలు అంతంత మాత్రమే ఉండడం, ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఇంగ్లిష్ తప్పనిసరి కాకపోవడంతో చాలామంది విద్యార్థులు అటువైపు వెళ్తున్నారని మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సభ్యుడు కె.రమేష్ రెడ్డి తెలిపారు. ఈ కారణంగా వారు ఎఫ్ఎంజీఈ పరీక్ష ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు యుక్రెయిన్, రష్యా, జార్జియా, బెలారస్, అర్మేనియా, బల్గేరియా, రొమేనియా, పోలాండ్, చైనా, ఫిలప్పీన్స్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలను వైద్య విద్య కోసం ఎంచుకుంటున్నట్టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ టి. కృష్ణ ప్రసాద్ తెలిపారు. తెలుగు విద్యార్థులు మాత్రం ఎక్కువగా ఫిలిప్పీన్స్, చైనా, యుక్రెయిన్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్‌ను ఎంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువు కోసం విదేశాలు వెళ్లనున్నట్టు ఆయన వివరించారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు మినహాయించి ఇతర దేశాల్లో చదువుకున్న మెడికల్ విద్యార్థులు ఎఫ్ఎంజీఈలో పాస్ కావాలన్న నిబంధనను 2002 నుంచి అమల్లోకి తీసుకువచ్చినట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు చెందిన ఎన్ఎస్ మూర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News