: మహారాష్ట్రలో పరువు హత్య.. 9 నెలల గర్భిణి తో పాటు, ఆమె భర్తను కొట్టి చంపిన వైనం!
మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. 9 నెలల నిండు గర్భిణిని అతి దారుణంగా కొట్టి చంపారు. థానేలో డైఘర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. దుండగులు మహిళ భర్తను కూడా విడిచిపెట్టలేదు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ శంకర్ యాదవ్(30), సుఫియా అబ్రార్ మన్‌సూరి అలియాస్ ప్రియా విజయ్ శంకర్ యాదవ్(22) 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుఫియా కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించడంతో వారు థానేలోని డైఘర్ వచ్చి స్థిరపడ్డారు. విజయ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టమైనా సుఫియా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో అందరికీ దూరంగా వీరు ఇక్కడే ఉంటున్నారు. ఇదిలా వుండగా, నిన్న విజయ్ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్టు ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో వచ్చి చూసిన పోలీసులకు రక్తపు మడుగులో పడి ఉన్న గర్భిణి సుపియా, ఆమె భర్త విజయ్ మృతదేహాలు కనిపించాయి. వారి హత్య జరిగి 48 గంటలు అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. వారి హత్యకు ముందు కొందరు బంధువులు విజయ్ ఇంట్లోకి వెళ్లడం చూసినట్టు ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుఫియా కుటుంబ సభ్యుల కోసం ఓ బృందాన్ని ఉత్తరప్రదేశ్ పంపించారు. విజయ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు మొదట సుఫియా పొట్టపై గట్టిగా కొట్టి ఆ తర్వాత కత్తితో మూడుసార్లు పొడిచినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఆమె భర్త గొంతును కత్తితో కోసి చంపేశారు. సుఫియా హిందూ మతంలోకి మారి వివాహం చేసుకోవడం ఇష్టంలేని కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.