: పాక్ వెన్నులో భయం మొదలైంది: బెలూచ్ నేత
స్వాతంత్ర్యం కోసం బెలూచిస్తాన్ ప్రజలు చేస్తున్న ఉద్యమాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన తరువాత, పాకిస్థాన్ తీవ్రంగా భయపడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ లో బెలూచ్ ప్రతినిధి మెహరాన్ మర్రీ వ్యాఖ్యానించారు. "ప్రధాని మోదీ నోటి వెంట బెలూచిస్తాన్ మాట వచ్చినప్పటి నుంచి పాక్ ప్రభుత్వం, సైన్యం వెన్నులో వణుకు మొదలైంది. ఉద్యమం మరింతగా పెరగకుండా చూసేందుకు బెలూచ్ ప్రాంతంలో భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. ఆగస్టు 15 నాటి ప్రసంగంలో మోదీ, మా ప్రస్తావన తేవడం పట్ల అభినందనలు. ఐరాస హెచ్ఆర్సీ సమావేశాల్లోనూ ఇండియా ఇదే విషయాన్ని ప్రస్తావించి, అంతర్జాతీయ సమాజానికి బెలూచ్ గురించి మరోసారి తెలిపింది" అని ఆయన అన్నారు. బెలూచ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం చెత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాక్ పట్ల అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఆయన కోరారు. బెలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని మెహరాన్ ఆరోపించారు.