: అమెరికాలో పేలిన శాంసంగ్ గెలాక్సీ నోట్-7.. కేసు పెట్టిన బాధితుడు!
శాంసంగ్ గెలాక్సీ నోట్-7 ఫోన్ల బ్యాటరీలు వేడెక్కడుతున్నాయంటూ వస్తున్న వార్తలతో ఆ ఫోన్లను వెనక్కి తీసుకుంటున్న శాంసంగ్‌కు ఇప్పుడో చిక్కొచ్చి పడింది. ఫ్లోరిడాకు చెందిన జొనాథన్ సోట్రబెల్(28) అనే వ్యక్తి ప్యాంటు జేబులో పెట్టుకున్న గెలాక్సీ నోట్-7 ఫోన్ పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన పాంబీచ్ కౌంటీలోని ఫ్లోరిడా స్టేట్ కోర్టులో శాంసంగ్ కంపెనీపై కేసు వేశాడు. ఫోన్ పేలడంతో తన తొడకు, చేతి వేలికి తీవ్ర గాయాలయ్యాయని, నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. జొనాథన్ కేసుపై శాంసంగ్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా గెలాక్సీ నోట్-7 ఫోన్లు పేలుతున్నాయంటూ వస్తున్న వార్తలతో కంపెనీ ముందుజాగ్రత్త చర్యగా ఫోన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెల్‌ఫోన్ బ్యాటరీలు వేడెక్కుతున్నట్టు ఇప్పటి వరకు కంపెనీ 92 ఫిర్యాదులు అందుకుంది.