: ప్రాణాలు తీసిన సెల్ఫీ ముచ్చట.. రిజర్వాయర్‌లో పడి ఐదుగురు బీటెక్ విద్యార్థుల మృతి
వరంగల్‌లోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఈరోజు ఐదుగురు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే. అందరి మృతదేహాలను బయటకు తీశారు. ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురు మరణించగా, ప్రత్యూష అనే విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. మృతి చెందిన విద్యార్థులని శ్రావ్యారెడ్డి, వినూత్న, శివసాయి, శివసాయికృష్ణ, సాగర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వారంతా రిజర్వాయర్ వద్దకు సెల్ఫీ తీసుకోవాలనే సరదాతోనే ప్రమాదానికి గురై మరణించినట్లు స్థానికులు చెప్పారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సరదాగా రిజర్వాయర్‌కు వద్దకు వెళ్లి గడుపుతున్నారు. అయితే, అక్కడ వాళ్లు పర్యాటకులు వెళ్లకూడని చోటుకి వెళ్లారు. అధికారులు అక్కడ పెట్టిన హెచ్చరిక బోర్డులను సైతం లెక్కచేయకుండా వెళ్లారు. కాసేపు అక్కడ ఆనందంగా గడిపిన తరువాత వాళ్లలో ఒక అమ్మాయి అందరం కలిసి సెల్ఫీ తీసుకుందామని చెప్పింది. రిజర్వాయర్ వద్ద ఉన్న బండరాయి మీద కాలు పెట్టి నిలబడింది. తమ స్నేహితులందరినీ తన వెనకవైపు నిలబడమని చెప్పింది. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బాగా పాకుడు పట్టిన రాయిపై ఆ విద్యార్థిని కాలుపెట్టింది. ఒక్కసారిగా జారి పడిపోయింది. తమ స్నేహితురాలిని కాపాడే ప్రయత్నంలో మిగతా ఐదుగురు విద్యార్థులు కూడా అలాగే జారి పడిపోయారు. ఈ విషయాల్ని స్థానికులు మీడియాకు వివరించి చెప్పారు. విద్యార్థులందరూ బండరాళ్ల మీద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి విద్యార్థుల మృతితో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.