: వర్షాల కోసం... బతికుండగానే ఓ వ్యక్తికి అంత్యక్రియలు జరిపిన వైనం!
బతికుండగానే ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా భీమసముద్ర గ్రామంలో జరిగింది. ఓ వ్యక్తిని చనిపోయిన వ్యక్తిలా పాడె మీద పడుకోబెట్టి అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ వ్యక్తి ముందు గ్రామస్తులంతా ఏడ్చి ఏడ్చి కళ్లు తుడుచుకొని అనంతరం శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని గొయ్యిలో కప్పి పెట్టారు. గ్రామస్తులంతా శ్మశానం నుంచి ఇంటికి వెళ్లిన తరువాత గొయ్యిలో కప్పేసిన వ్యక్తి మళ్లీ లేచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి చెరువు వద్దకు వెళ్లి స్నానం చేసి, అటునుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా తమ ప్రాంతంలో వర్షాలు పడాలని చేస్తున్నారట. తమ ప్రాంతంలో వానలు పడడం మూడు నెలలు ఆలస్యం అయితే తామంతా కలిసి మాట్లాడుకొని ఈ పని చేస్తామని గ్రామస్తులు మీడియాకు చెప్పారు. శవంలా నటించే వారు స్వచ్ఛందంగానే ముందుకు వస్తారని అన్నారు. కర్ణాటకలో ప్రబలుతున్న మూఢనమ్మకాలను అరికట్టాలని ఓ వైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయినప్పటికీ వాటినుంచి బయటపడలేకపోతున్న కొందరు ప్రజలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం మూఢాచారాలకు వ్యతిరేకంగా ఓ బిల్లును కూడా తీసుకురావాలని చూస్తోంది. టీవీల్లో ప్రసారమయ్యే జాతకాల కార్యక్రమాలను కూడా బ్యాన్ చెయ్యాలని చూస్తోంది.