: భూమనను ఏదోఒక విధంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు!: వైసీపీ నేత అంబటి రాంబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి ఈరోజు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేయడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... భూమనను ఏదోఒక విధంగా ఈ కేసులో ఇరికించాలనే నోటీసులు పంపించారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైసీపీ నేతలు భయపడబోరని ఆయన అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనేదే చంద్రబాబు నైజం అని అంబటి వ్యాఖ్యానించారు. తుని ఘటనకు చంద్రబాబు సర్కారు వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో భూమనను గంటల కొద్దీ విచారించి, అరెస్టు చేస్తారేమోనన్న వాతావరణం సృష్టించారని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా ఎల్లుండి మళ్లీ విచారణకు రావాలని ఆదేశించడమేంటని ఆయన ప్రశ్నించారు.