: 'ల్యాండ్ ఆఫ్ రేప్స్' అని విదేశీయులంటుంటే సిగ్గేస్తోంది: అమితాబ్ బచ్చన్
మన దేశాన్ని విదేశీయులంతా 'ల్యాండ్ ఆఫ్ రేప్స్' అని పిలుస్తోంటే సిగ్గుగా ఉందని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'పింక్' సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా సరే మహిళల భద్రతకు ఢోకా లేకుండా ఉండాలని కోరారు. భారత దేశంపై విదేశీయుల్లో ఉన్న అపోహను తొలగించేందుకు ప్రతి భారతీయుడు పాటుపడాలని ఆయన సూచించారు. భారతదేశాన్ని తృతీయ శ్రేణి దేశంగా కానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగా కానీ పేర్కొంటే తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పిన ఆయన, భారత్ ను అంతా అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనాలని ఆకాంక్షించారు. అలా జరగాలంటే మహిళలపై దారుణాలు ఆగిపోవాలని ఆయన సూచించారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. భారత్ ను ప్రధమ శ్రేణి దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించేందుకు అవసరమైన కృషి చేసే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపైనా ఉందని ఆయన గుర్తు చేశారు.