: అఖిలేశ్ కోసం యువత ప్రాణత్యాగం సైతం చేస్తుంది.. ఆయనకే పార్టీ పగ్గాలివ్వాలి: స‌మాజ్‌వాదీ కార్యకర్తల నిరసనలు


ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో విభేదాలు కొన‌సాగుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి హోదా నుంచి అఖిలేశ్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ స‌మాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల అఖిలేశ్ మ‌ద్ద‌తుదారులయిన కార్య‌క‌ర్త‌లు వందల సంఖ్యలో లక్నోలోని పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి నిర‌స‌న తెలిపారు. పార్టీ అఖిలేశ్ యాదవ్ అధీనంలోనే న‌డ‌వాల‌ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఓ వైపు ములాయం సింగ్ పార్టీలో గొడ‌వ‌లేమీ లేవని ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో నిర‌స‌న సెగ‌లు త‌గ్గ‌డం లేదు. త‌ల‌పై ఎర్రటోపీలు ధరించి అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ పోస్టర్లను ప్ర‌ద‌ర్శిస్తూ కార్య‌కర్త‌లు నిర‌స‌నలో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి అఖిలేశే పార్టీని నడిపించగల స‌మ‌ర్థ‌త ఉన్న వ్య‌క్తి అంటూ ములాయం సింగ్ కు వీరు లేఖ కూడా రాశారు. వేరే వారి నాయ‌క‌త్వంలో పార్టీ న‌డ‌వ‌డాన్ని తాము ఒప్పుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. ములాయం సింగ్ తీసుకున్న నిర్ణ‌యాన్ని రాష్ట్ర‌ యువత జీర్ణించుకోలేకపోతోందని వారు అన్నారు. అఖిలేశ్ కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా రాష్ట్ర‌ యువత సిద్ధంగా ఉన్నార‌ని వారు అన్నారు. మ‌రోవైపు త‌మ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా శివ్ పాల్ యాదవే కొన‌సాగుతార‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

  • Loading...

More Telugu News