: మోదీ స్పందనతో పాక్ వణికిపోతోంది.. అమెరికా కూడా తమ తీరు మార్చుకోవాలి: బలూచిస్థాన్ పౌర హక్కుల ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్థాన్ అంశాన్ని లేవనెత్తినప్పటి నుంచి పాకిస్థాన్ వణికిపోతోందని ఐక్యరాజ్య సమితిలో బెలూచిస్థాన్ పౌర హక్కుల ప్రతినిధి మెహ్రాన్ మర్రీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మోదీ వ్యాఖ్యల ప్రభావంతో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్లను అధికం చేసిందని చెప్పారు. పాకిస్థాన్ పీఓకేతోపాటు బలూచ్‌లో తీసుకుంటున్న విపరీత చర్యలపై మోదీ స్పష్టంగా వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు. ఐరాస హ్యుమన్ రైట్స్ కమిషన్ ముందు బలూచిస్థాన్ లో పాక్ దిగుతోన్న చర్యలపై భారత్ స్పందించినందుకు బెలూచ్ ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని ఆయన అన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలతో తమలో కొత్త ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాకు బలూచిస్థాన్ పై పాకిస్థాన్ చేస్తున్న దురాగతాల గురించి తెలుసని ఆయన అన్నారు. అయినప్పటికీ ఆ దేశం బలూచ్‌పై స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశం పట్ల భారత్ కనబరుస్తోన్న తీరునే అమెరికా కూడా కనబర్చాలని తాము అగ్రరాజ్యానికి విన్నవించుకున్నట్లు చెప్పారు. అయినా ఆ దేశం స్పందించడం లేదని చెప్పారు.