: భారత్ ఆశ్రయమిస్తే రావడానికి రెడీ: బలూచిస్తాన్ నేత ప్రకటన
పాకిస్తాన్ లో అంతర్భాగమైన బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న నేతలకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్ ఉద్యమ నేతలు దరఖాస్తు చేసుకుంటే వారంలోపే అనుమతి జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై శనివారం పాకిస్తాన్ పత్రికల్లోనూ వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆశ్రయం ఇస్తే వచ్చేందుకు సిద్ధమేనని బలూచిస్తాన్ నేత బ్రహుమ్ దగ్ బుగ్తి తెలిపారు. ‘భారత్ కు వెళ్లే అవకాశమే లభిస్తే తప్పకుండా నా ప్రాంత ప్రజల కోసం వెళతాను’ అని బుగ్తి తెలిపారు. ఆశ్రయం కోరే విషయంలో 19న జరిగే బలూచ్ రిపబ్లిక్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రహుమ్ దగ్ బుగ్తి బలూచ్ రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. 2006 లో తన తండ్రి అక్బర్ బుగ్తిని పాక్ దళాలు కాల్చి చంపడంతో ప్రాణభయంతో ఆయన తొలుత అఫ్గాన్ కు వలస వెళ్లారు. తనకు, తన కుటుంబానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం కల్పించడంతో అఫ్గాన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ తలదాచుకుంటున్నారు.