: నేతల కన్నా జనం తెలివైన వారని మరోసారి నిరూపించారు: ప్రత్యేక హోదాపై వెంకయ్య
నేతల కన్నా జనం తెలివైన వారని మరోసారి నిరూపించారని, ప్రతిపక్షాల విమర్శలను వారు పట్టించుకోకుండా ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని అర్థం చేసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హోదాతో సమానమైన ప్యాకేజీని సాధించినందుకు ఆయనను ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులు విజయవాడలో సన్మానించాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... నాగాలాండ్, మిజోరాం, అసోం, సిక్కిం వంటి రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని, కొండ ప్రాంతాలయిన హిమాచల్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా భావించి వాటికి హోదా ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ప్యాకేజీపై విమర్శలను తిప్పికొట్టేందుకే తాను విజయవాడ వచ్చినట్లు వెంకయ్య వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. 2004లో ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ తెస్తామని కాంగ్రెస్ చెప్పిందని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ఈ అంశంపై తీర్మానం చేశాక అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్ ఆ అంశాన్ని పక్కనపెట్టేసిందని చెప్పారు. 2014లో తెలంగాణ ఇచ్చే ముందు కాంగ్రెస్ రహస్యసర్వే చేసిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు పొందడానికే రాష్ట్ర విభజన చేశారని పేర్కొన్నారు. ఏపీలో తమ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకొని తెలంగాణ నుంచి సీట్లు పొందవచ్చని ఆశించే కాంగ్రెస్ విభజన చేయాలని నిర్ణయించుకుందని వెంకయ్య అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామనే అందరు నేతలు ప్రయత్నించి దానిపైనే దృష్టి పెట్టారని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్యాకేజీపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. బాగా వెనకబడిన ప్రాంతాలకు మాత్రమే ప్యాకేజీ ఇస్తారని చెప్పారు.