: విమాన పైలట్ ను షాక్ కు గురిచేసిన రాహుల్ గాంధీ గార్డులు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భద్రతగా ఉన్న ఎస్పీజీ గార్డులు ఇటీవల ఓ విమాన పైలట్ ను షాక్ కు గురిచేశారు. ఈ నెల 14న రాహుల్ ఇండిగో విమానంలో ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. రాహుల్ కు భద్రతగా ఉన్న ఎస్పీజీ గార్డులు సదరు విమాన పైలట్ ను లైసెస్స్ చూపించమన్నారు. అంతటితో సర్దుకుపోలేదు. విమానంలోని ఇంధనం నాణ్యతను కూడా పరీక్షించి చూపాలని డిమాండ్ చేశారు. నిజానికి పైలట్ల లైసెన్స్ ను చూపించాలని అడిగే హక్కు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు మినహా మరెవరికీ లేదు. ఆ సమయంలో పౌర విమానయాన శాఖాధికారులు కలుగజేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. ఈ కారణంగా విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. మొత్తానికి ఈ పరిస్థితితో సిబ్బంది నిశ్చేష్టులయ్యారట.