: కేసీఆర్ ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేపడతారని భయం వేసింది.. మనసులోని మాట చెప్పిన ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన అన్ని పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ‘విభజన కథ’ పేరిట పుస్తకం రాశారు. విభజన సందర్భంగా జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఎమెస్కో ఈ పుస్తకాన్ని ప్రచురించగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 18, 2014 లోక్సభలో, 20న రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలపై సుదీర్ఘంగా వివరించారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం యథాతథంగా.. జూలై 20, 2005. నేను కొత్తగా ఎన్నికైన ఎంపీని. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నా. అదే విమానంలో అప్పటి కేంద్రమంత్రులు అయిన కేసీఆర్, ఆలె నరేంద్ర కూడా ఉన్నారు. కేసీఆర్ నన్ను పిలిచి ఆయన పక్కన కూర్చోమన్నారు. ఆ తర్వాత విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయ్యేంత వరకు అంటే దాదాపు గంటంపావు వరకు నా బ్రెయిన్ వాష్ చేశారు. ఆయనతో కూర్చున్నాకే ‘బ్రెయిన్ వాష్’ అనే పదానికి అర్థం తెలిసింది. ఉమ్మడి రాష్ట్రం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో సమావేశాల్లో ఆవేశంగా చెప్పే కేసీఆర్ నాతో మాత్రం ఉమ్మడి రాష్ట్రం వల్ల కోస్తా, రాయలసీమకు జరుగుతున్న నష్టం గురించి వివరించి చెప్పారు. స్కూలు మాస్టారు లెక్కలు చెప్పినట్టు ప్రతి ఒక్కదాన్ని వివరించి చెప్పారు. దీంతో ఆయనెక్కడ ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలుపెడతారో అన్న సందేహం కలిగింది. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పా. ప్రత్యేక రాష్ట్రం వల్ల వచ్చే ఉపయోగాలపై మీ దగ్గర కూడా ఉద్యమం జరగాలి. 1972 నాటి ఉద్యమంలో మీరు కూడా చురుగ్గా ఉన్నారు కదా అన్నారు. అయితే అప్పటి హైదరాబాద్, ఇప్పటి హైదరాబాద్ వేరని ఆయనకు చెప్పా. 'మీరు తెలంగాణను కోరుకుంటున్న విషయం మాకర్థమైంది. మమ్మల్ని హైదరాబాద్ వదిలి పొమ్మంటున్న విషయం కూడా అర్థమైంది' అని కేసీఆర్తో చెప్పా. అయితే ఆ ఆలోచన తెలంగాణ వారికి లేదని, కేవలం కొందరు సీమాంధ్ర నాయకులు అలా ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఇదే విషయాన్ని అందరికీ పిలిచి చెప్పాలని సూచించా. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు ఒప్పుకోడని కేసీఆర్ అన్నారు.