: ట్రంప్ జుట్టుతో ఆడుకున్న టీవీ వ్యాఖ్యాత!
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు ఒక తమాషా అనుభవం ఎదురైంది. నేషనల్ టెలివిజన్ షో ‘ద టునైట్ షో’కి నిన్న ట్రంప్ హాజరయ్యారు. ఈ ‘షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ ఫాలోన్ ఇంటర్వ్యూలో చివరిలో ట్రంప్ ను ఒక సరదా కోరిక కోరాడు. ‘మీరు మళ్లీ మా షోకి అమెరికా అధ్యక్షుడిగా రావచ్చు. అప్పుడు చేయలేను కనుక, ఇప్పుడే, ఆ పని చేయాలనిపిస్తోంది. ఒకసారి, మీ జుట్టును చెరిపేయొచ్చా?’ అని ఫాలోన్ అడిగాడు. అడగటమే ఆలస్యం, ఇందుకు ట్రంప్ చిరునవ్వుతో ఓకే చెప్పారు. వెంటనే, ట్రంప్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి, ఆయన క్రాఫ్ అంతా ఫాలోన్ చిందరవందర చేసేశాడు. దీంతో, ఈ షో చూస్తున్న ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేశారు. ప్రేక్షకులే కాదు, ట్రంప్ కూడా నవ్వేశారు. తన పోజ్ చూసుకున్న ట్రంప్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ గా మారింది. మరోవిషయం ఏమిటంటే, ట్రంప్ జుట్టు అసలైందా? లేక విగ్గా? అనే విషయమై గతంలో పలు వదంతులు ఉండేవి. దీంతో, ఆ అనుమానం ఉన్నవారికి తీరిపోయింది.