: నయీమ్ తో ఎలాంటి సందర్భాల్లో, ఎలా మాట్లాడేవాడినంటే..: ఆర్.కృష్ణయ్య


నయీమ్ తో తనకు మంచి పరిచయం ఉందని అంగీకరించిన బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఎలాంటి సందర్భాల్లో మాట్లాడతానన్న విషయాన్ని టీవీ చానల్స్ కు వివరించారు. ఓ ఎమ్మెల్యేగా, బడుగుల సమస్యలు తీర్చే తన వద్దకు నిత్యమూ వేలాది మంది వస్తుంటారని, వారిలో కొందరు నయీమ్ బాధితులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. ఓసారి ఓ న్యాయవాది, మరో షాపు యజమాని తన వద్దకు వచ్చారని, నయీమ్ బెదిరిస్తున్నాడని, డబ్బు కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారని గుర్తు చేసుకున్నారు. "ఇలాంటి వ్యవహారాల్లో నేను తలదూర్చలేనని స్పష్టంగా చెప్పేవాడిని. ఆ సమయంలో నయీమ్ మీకు శిష్యుడు కదా? మీరు చెబితే వింటాడు. మా బాధ తీర్చండని బాధితులు వేడుకునేవారు. అప్పుడు కూడా నేను ఫోన్ చేసేవాడిని కాను. మరోసారి మీ దగ్గరకు నయీమ్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయించమని కోరేవాడిని. ఆపై ఎప్పుడో ఫోన్ వచ్చేది. అప్పుడు మాత్రం బాధితులకు అండగా నిలబడి, నయీమ్ ను ఇటువంటి పనులు కూడదని హెచ్చరించేవాడిని. అంతకుమించి మరేమీ సంభాషణలు మా మధ్య జరిగేవి కాదు. కుట్రతోనే నన్ను ఇరికించారు. ఎంత వరకైనా వెళతా" అని చెప్పారు. తన ఫోన్ నుంచి అతనికి ఒక్క కాల్ వెళ్లినట్టు చూపించినా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పిన కృష్ణయ్య, సంవత్సరానికి మూడు నాలుగు సార్లు నయీమ్ నుంచి ఫోన్లు వచ్చేవని చెప్పారు.

  • Loading...

More Telugu News