: నయీమ్ బాగా తెలుసు... అంతమాత్రాన నేరస్తుడినా?: పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో మీడియా ముందుకు ఆర్.కృష్ణయ్య
నయీమ్ తో తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యకు సంబంధాలు ఉన్నాయని, నేడో, రేపో ఆయన అరెస్ట్ తప్పదని వార్తలు వస్తున్న వేళ, కృష్ణయ్య పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేశారు. నయీమ్ కు, తనకు 25 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం ఉందని గుర్తు చేసుకున్న ఆయన, ఇటీవలి కాలంలో మాత్రం ఆయన్ను కలవలేదని, తన ఫోన్ నుంచి కాల్స్ కూడా చేయలేదని చెప్పారు. నయీమ్ మాత్రం తనకు ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడని అన్నారు. అంతమాత్రాన తను నేరస్తుడినని తప్పుడు లీకులిస్తున్నారని, వాస్తవానికి నయీమ్ దందాలో పాలు పంచుకున్నది టీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. తనను కుట్ర పూరితంగా ఇరికించేందుకు టీఆర్ఎస్ పార్టీ తన సొంత మీడియాను వాడుకుంటోందని, కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 'నమస్తే తెలంగాణ' దినపత్రికలో తన అరెస్ట్ తప్పదని వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, వార్త రాసిన విలేకరిని కూడా విచారణ కమిటీలో నియమించి నిజానిజాలను వెలుగులోకి తీయాలని నిప్పులు చెరిగారు. కేసీఆర్, తన పార్టీలోని నేతలను కాపాడుకునేందుకు, బడుగు నేతలను ఇరికించాలని చూస్తున్నారని, తన 30 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఎన్నడూ అవకతవకలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు.