: షాబుద్దీన్ కు బెయిల్ రద్దు చేయాలంటూ ‘సుప్రీం’ను ఆశ్రయించిన నితీశ్ సర్కార్
రెండు శిక్షల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ నేరచరితుడు, రాష్ట్రీయ జనతా దళ్ నేత అయిన మహమ్మద్ షాబుద్దీన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన అంశం వివాదాస్పదంగా మారింది. షాబుద్దీన్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ నితీశ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాబుద్దీన్ సన్నిహితుడు. 2005లో నితీశ్ కుమార్ మొదటిసారి సీఎం పదవిలోకి వచ్చాక షాబుద్దీన్ మొదటిసారి జైలుకు వెళ్లాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ,జేడియులు కలిసి మహాకూటమిగా పోటీచేసి విజయం సాధించాయి. అయితే, ఇటీవలే బెయిల్ పై విడుదలైన షాబుద్దీన్, నితీశ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ‘లాలూ మాత్రమే తమ నాయకుడంటూ’ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ స్పందించింది. షాబుద్దీన్ విషయంలో ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే షాబుద్దీన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.