: 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు... తిరుమలకు ప్రత్యేక బస్సులు
వచ్చే నెల 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటన చేసింది. తిరుమల అన్నమయ్య భవన్ లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ, అక్టోబర్ 3న స్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని, 7వ తేదీ రాత్రి 7.30 గంటలకు స్వామివారి గరుడ వాహన సేవ జరుగుతుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ క్యాలెండర్లు, డైరీలను చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. గరుడవాహన సేవ రోజున భక్తుల కోసం తిరుమలకు 3,600 బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని, ఈ సేవను వీక్షించేందుకు 1.75 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గరుడ వాహన సేవను భక్తులందరూ తిలకించే విధంగా 30 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు సాంబశివరావు పేర్కొన్నారు.