: వెంటాడుతున్న ‘నయీం’.. మాజీ మంత్రికి సిట్ నోటీసులు!
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా ఓ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నయీంను ముందుపెట్టి కోట్లాది రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరానికి చెందిన ఆ మాజీ మంత్రి గత కొన్ని రోజులుగా అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆయనను విచారించేందుకు నోటీస్ పంపినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా విచారించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నయీం ఎన్‌కౌంటర్ తర్వాతి నుంచి కనిపించకుండా పోయిన మాజీ మంత్రి అధికారంలో ఉన్న పదేళ్లు గ్యాంగ్‌స్టర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు సిట్ కు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. నగరంలో భూమి కనిపిస్తే చాలు, జెండా పాతే అలవాటున్న ఈ మాజీ మంత్రి ఇందుకోసం నయీం సహకారాన్ని వాడుకున్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. నయీం అండదండలతోనే ఆయన చెలరేగిపోయారని చెబుతున్నారు. మాదాపూర్‌లో పది ఎకరాల భూమి సెటిల్‌మెంట్ వ్యవహారంలో నయీం మనుషులను పంపి మాజీ మంత్రి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టు సమాచారం.