: వెస్టిండీస్ కోచ్ ను అర్థాంతరంగా తొలగించడంపై డారెన్ స్యామీ మండిపాటు
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ను తొలగించడం పట్ల ఆ దేశ టీ 20 మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు అనవసర పట్టింపులకు పోతున్నారని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టుని పూర్తిగా నాశనం చేయడమే బోర్డు పనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డు చేసిన పని అనాలోచితమేనని ఆయన అన్నాడు. యూఏఈ మైదానాల్లో మరో రెండు రోజుల్లో పాకిస్థాన్‌తో తమకు సిరీస్ ఉండగా ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించాడు. తమ దేశ జట్టును మెరుగుపర్చడానికి బోర్డు చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ విమర్శించాడు. పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడు. బోర్డు ఇలాగే ముందుకు వెళ్లాలని చూస్తే వాటి ఫలితాలు కూడా అలానే వస్తాయని చెప్పాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న విషయాన్ని బోర్డు గుర్తించుకోవాలని హితవు పలికాడు.