: తెలంగాణ ఎంసెట్ 3 ఫలితాలు విడుదల... 152 మార్కులతో ఏపీ అమ్మాయి మానసకు ఫస్ట్ ర్యాంక్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటిక్రితం ఉన్నత విద్యా మండలి ఫలితాలను విడుదల చేసింది. 152 మార్కులు తెచ్చుకున్న కృష్ణా జిల్లా గుడివాడ విద్యార్థిని రాగళ్ల మానసకు తొలి ర్యాంకు లభించింది. రెండో ర్యాంకును సికింద్రాబాద్ కు చెందిన హారిక అనే విద్యార్థిని కైవసం చేసుకుంది. మూడవ ర్యాంకు అనంతపురంకు చెందిన తేజస్విని సొంతం చేసుకుంది. నాలుగో ర్యాంకు హైదరాబాద్ బహదూర్ పురా ప్రాంతానికి చెందిన జి.అహ్మద్ కు దక్కింది. ఐదో ర్యాంకును మెహిదీపట్నంకు చెందిన ఇమ్రాన్ ఖాన్, ఆరో ర్యాంకును సికింద్రాబాద్ కు చెందిన ఎం.శ్రీకాంతేశ్వర్ రెడ్డి సాధించారు. రెండు నుంచి ఆరు ర్యాంకుల జాబితాను అభ్యర్థుల పేర్ల ఆల్ఫా బిటికల్ ఆర్డర్ ఆధారంగా ప్రకటించారు. వీరు ఐదుగురికీ 151 మార్కుల చొప్పున వచ్చాయి. ఏడో ర్యాంకును ఖమ్మంకు చెందిన మిట్టపల్లి అలేఖ్య, ఎనిమిదో ర్యాంకును ఆదిలాబాద్ కు చెందిన ఎన్.ఫాతిమా, తొమ్మిదో ర్యాంకును బేగంపేటకు చెందిన కె.కావ్య, పదో ర్యాంకును మిర్యాలగూడకు చెందిన వేంపాటి రూపేశ్ సాధించారు. వీరందరికీ 150 మార్కుల చొప్పున వచ్చాయి.