: హోదా కోసం పోరాడుతుంటే 'శివాజీ ఎవరు? వాడిదే కులం?' అనడుగుతున్నారు!: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతుంటే తనను శివాజీగాడు ఎవడు? వాడిది ఏ కులం? అని కొందరు ప్రశ్నిస్తున్నారని హీరో శివాజీ వాపోయారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఈరోజు 'జాబు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి' అనే నినాదంతో ఉన్న పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులాలను మనం క్రియేట్ చేసుకున్నామని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారేంటని ఆయన దుయ్యబట్టారు. హోదా కోసం పోరాడుతుంటూ మధ్యలో ఈ కులమెందుకు వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. సమాజం హితం కోసం పోరాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హోదాకోసం మభ్యపెడుతూ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని శివాజీ అన్నారు. ప్రత్యేక హోదాతో లాభం లేదంటూ, ప్రత్యేక సాయం చేస్తామంటూ చెబుతున్నారని, అసలు ఇటువంటి మాటలు ఎన్నిరోజులు చెబుతారని ఆయన ప్రశ్నించారు. వేరే దేశాలకు కూడా ప్రధాని మోదీ నిధులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మనకీ అంతేనా? అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలే ఆనాడు హోదాపై మాట్లాడాయని ఆయన అన్నారు. హోదా వస్తే పరిశ్రమలు రావని వెంకయ్య అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హోదా కోసం ప్రజలతో చర్చించాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ లాంటి వారు హోదాపై అడిగినప్పుడు ఎందుకు వీరు అసహనానికి గురవుతున్నారని ఆయన అడిగారు. ‘మిమ్మల్ని అగడవద్దా.. ఇదేమైనా కుటుంబానికి సంబంధించిన విషయమా?’.. అని శివాజీ అన్నారు. మళ్లీ ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతారని ఆయన జోస్యం చెప్పారు. 'పలు రాష్ట్రాలకే ప్రత్యేక హోదా తీసేస్తున్నారని అంటున్నారు.. వాటి సమయం అయిపోయింది, అందుకే తీసేస్తున్నారు. ఆ రాష్ట్రాలతో లింకెందుకు పెడుతున్నారు?' అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రత్యేక హోదాని వదులుకుంటారా? అని ఆయన అన్నారు. తనలా ప్రశ్నించేవారిని తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పుడు ప్రచారాలతో మమ్మల్ని విమర్శిస్తున్నారు. మన ఆత్మగౌరవం గురించి చలసాని శ్రీనివాస్ పోరాడుతున్నారు.. ఆయనను కూడా విమర్శిస్తారా... రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారు. పోలవరం అంటూ డ్రామాలాడుతున్నారు. పోలవరానికి చల్లబద్ధత కల్పించేటప్పుడు ఎన్నో లింకులు పెడతారు. ప్యాకేజీతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి వారు హోదా కోసం పోరాడి తీరాలి. హోదా వస్తే ఉద్యోగాలు రావని అంటున్నారు. ఎన్నో ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మమ్మల్ని ఏం మాట్లాడవద్దని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రప్రయోజనాలంటూ ప్రజల ముందుకు హామీలు గుప్పిస్తూ వస్తారు. గాడ్సే రూట్ లో వెళుతున్నారు. మేము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం. అయినా మా మీద మండిపడుతున్నారు. హోదా వల్ల రాష్ట్రానికి 60 వేల కోట్ల రూపాయల ప్రయోజనం ఉంది’ అని శివాజీ అన్నారు.