: ప్రధానికి ఓ యువతి రాసిన లేఖతో ఆ గ్రామంలో వెలుగులు!


ఓ యువ‌తి రాసిన చిన్న లేఖతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఇటా జిల్లాలోని బిదియా గ్రామవాసుల్లో తాజాగా సంతోషం నిండింది. 11 ఏళ్లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న గ్రామ‌స్తులు ఇప్పుడు విద్యుత్ కాంతులను పొందుతున్నారు. త‌మ‌ గ్రామంలో విద్యుత్ లేదంటూ ప్ర‌భుత్వాల‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫ‌లితం ద‌క్క‌ని ఆ గ్రామ‌స్తులు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని దీప్తి మిశ్రా (23) అనే యువతి త‌మ గ్రామ ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఆన్‌లైన్‌లో పీఎంవోకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఎన్ని సంవత్స‌రాలు తాము విద్యుత్ క‌ష్టాలు ఎదుర్కోవాల‌ని ఆ లేఖలో ఆమె ప్ర‌శ్నించింది. గ్రామ‌స్తులంతా క‌లిసి ఎన్నో ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తోన్నా సాధించ‌ని ఫ‌లితాన్ని ఆమె తాను చేసిన ఫిర్యాదుతో సాధించింది. బిదియా గ్రామంలో మొద‌టిసారిగా ప్ర‌భుత్వం 2005 జనవరిలో విద్యుత్ సదుపాయం క‌ల్పించింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు ఐదు నెల అనంత‌రం అక్క‌డ‌ భారీ తుపాను రావడంతో విద్యుత్ లైన్లు పాడ‌యిపోయాయి. అప్ప‌టి నుంచి తాము చీక‌టిలోనే బ‌తుకుతున్నారు. మొదట్లో బ్లాక్ స్థాయిలో గ్రామస్తులు త‌మ స‌మ‌స్య‌పై ఫిర్యాదుచేశారు. అయితే ఫ‌లితం మాత్రం శూన్యం. విసిగిపోయిన గ్రామ‌స్తులు ఇక ఫిర్యాదుల జోలికే పోలేదు. దీప్తి మాత్రం త‌మ సమ‌స్య‌ను ప‌ట్టించుకొని ప్ర‌ధాని కార్యాల‌యానికి ఫిర్యాదు చేసింది. దీంతో సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలో పాడైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. అంతేగాక‌, మూడు ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఇళ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాలంటే ముందుగా వారు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాల్సి ఉంది. గ్రామ‌స్తులు క‌నెక్ష‌న్లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారి అన్నారు. అయితే, దీనిపై గ్రామ‌స్తులు భిన్నంగా స్పందించారు. 11 ఏళ్లుగా విద్యుత్తే లేనప్పుడు కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేస్తామని ఫిర్యాదు చేసిన యువ‌తి అడిగింది. విద్యుత్ వ‌చ్చింది కాబ‌ట్టి ఇప్పుడు తీసుకుంటామ‌ని పేర్కొంది. స‌ద‌రు గ్రామంలో 12వ తరగతి వరకు చ‌దువుకున్న దీప్తి అనంత‌రం ఉన్న‌త చ‌దువును కొన‌సాగించ‌డానికి నగరానికి వెళ్లిపోయింది. ఆమె నోయిడాలో మాస్‌ కమ్యూనికేషన్స్ కోర్సు పూర్తిచేసింది.

  • Loading...

More Telugu News