: అప్పుడు హోదా కోసం పట్టుబట్టాను నిజమే, కానీ ఇప్పుడు ఏమీ చేయలేను: వెంకయ్యనాయుడు


తాను రాజ్యసభలో విపక్ష సభ్యుడిగా ఉన్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన మాట వాస్తవమేనని, అయితే, ఇప్పుడు మాత్రం హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీని మాత్రమే ఇస్తున్నామని కేంద్రం వెల్లడించిన తరువాత తొలిసారిగా ఆయన విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనని అన్న వెంకయ్యనాయుడు, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతయినా కేంద్రం ఇస్తుందని అన్నారు. ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుందని, ఇక ఏపీ ప్రజలు హోదా విషయాన్ని పక్కనబెట్టి అభివృద్ధి దిశగా సాగాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులిచ్చేందుకు తమ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ అభివద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News