: మరిన్ని చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్... ఆయన ఫౌండేషన్ నిధులపై విచారణ ప్రారంభించిన అధికారులు


రిపబ్లికన్ల తరుఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతూ, ప్రజా మద్దతు పొందడంలో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా కాస్తంత వెనకబడిన డొనాల్డ్ ట్రంప్, మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఆధ్వర్యంలోని డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ కు వచ్చిన నిధులపై న్యూయార్క్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫౌండేషన్ లో అక్రమాలు సాగాయన్న ఆరోపణలపై విచారణ మొదలైందని, న్యూయార్క్ లోని నాన్ ప్రాఫిట్ సంస్థల నియంత్రణా విభాగం అటార్నీ జనరల్ ఎరిక్ షినైడర్ మాన్ 'సీఎన్ఎన్' వార్తా సంస్థకు తెలిపారు. కాగా, ట్రంప్ ఫౌండేషన్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై 'ది వాషింగ్టన్ పోస్ట్' సహా పలు ప్రముఖ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఫౌండేషన్ కు 2008 నుంచి తన వంతుగా ఒక్క డాలర్ కూడా ఇవ్వని ట్రంప్, బయటి నిధులను భారీగా మెక్కినట్టు ఆరోపణలు వచ్చాయి. తన నిలువెత్తు చిత్రాన్ని గీయించుకోవడం కోసం ఫౌండేషన్ కు చెందిన 20 వేల డాలర్ల నిధులను వాడుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. చట్టవిరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగిందని, అన్ని ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతుందని ఎరిక్ వివరించారు. ట్రంప్ ఫౌండేషన్ చట్టాన్ని అతిక్రమించిందా? అన్న కోణంలో ఎంక్వయిరీ సాగనున్నదని తెలిపారు.

  • Loading...

More Telugu News