: ఈ జీవితానికి, ఈ జన్మకు ఇది చాలు: జూనియర్ ఎన్టీఆర్
‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈ జీవితానికి, ఈ జన్మకు ఇది చాలు’ అని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. హైదరాబాదులో జరుగుతున్నా ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రకరకాల రిపోర్టులు వచ్చినప్పుడు, కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్టవాలో అర్థం కాలేదు. దర్శకుడు శివ మీద పెట్టుకున్న నమ్మకం తప్పవదే, ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకం తప్పవదే, అభిమానులకు నేను ఇచ్చిన మాట తప్పవదే అని చాలా మధన పడిపోయాను. కానీ, అదేరోజు వచ్చిన ఫైనల్ రిపోర్ట్ తో సంతోషపడిపోయాను. నా అభిమానుల్లో ఈ ఆనందాన్ని చూడటానికి ఇన్నేళ్లు పట్టింది. జనతా గ్యారేజ్ వల్ల అభిమానుల్లో ఆనందం చూడగలిగాను, మా అమ్మనాన్నలకు ఒక గిప్ట్ ఇవ్వగలిగాను. విజయాలు దక్కుతున్నాయి. కానీ, ఇటువంటి విజయం కోసం పదమూడేళ్లు ఆగాను. ఈరోజు మీ అందరి ముందు తలెత్తుకు తిరిగేలా చేసిన మా ‘జనతా గ్యారేజ్’ దర్శకుడు శివకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఈ విజయం నా గుండెల్లో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చాలా మాట్లాడాలని ఉంది. మీ అందరి ముందర వ్యక్తపరచలేని ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఆనందంతో వచ్చే ఏడుపు ఆపుకుంటున్నాను’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు.