: నా నగ్న ఫొటోను ‘ఫేస్ బుక్’ పోస్ట్ చేసి, పరువు తీసింది: కోర్టు కెక్కిన బాలిక
తన నగ్న ఫొటోను ఇప్పటికే పలుసార్లు పోస్ట్ చేసి పరువుతీసిందంటూ పద్నాలుగేళ్ల బాలిక కోర్టుకెక్కింది. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన ఈ బాలిక, తన ఫోటోను అప్ లోడ్, రీ అప్ లోడ్ కు ‘ఫేస్ బుక్’ అనుమతించిందంటూ మండిపడుతోంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ హైకోర్టును బాధిత బాలిక ఆశ్రయించింది. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘ఫేస్ బుక్’ యాజమాన్యం చేసిన వాదనను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బాలిక తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫొటోను సంపాదించాడని, ఆ ఫొటోను ‘ఫేస్ బుక్’లో అప్ లోడ్ చేశాడని పేర్కొన్నారు. ఇటువంటి ఫొటోలను బ్లాక్ చేయాల్సిన ‘ఫేస్ బుక్’ అధికారులు, ఆ విధంగా చేయలేదని అన్నారు. అదే ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ‘ఫేస్ బుక్’ సంస్ధ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే, ఈ ఫొటోను మొట్టమొదట అప్ లోడ్ చేసిన వ్యక్తిపై కూడా కేసు పెడతామని అన్నారు. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలుసార్లు ఆ ఫొటో ను ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చేశారని, తన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని, డేటా పరిరక్షణ చట్టాన్ని ‘ఫేస్ బుక్’ ఉల్లంఘించిందంటూ బాధిత బాలిక ఆరోపించింది. కాగా, 1972లో వియత్నాంలో జరిగిన ఒక దాడికి సంబంధించిన ఫొటోను నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్ ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో దుస్తులు లేకుండానే పరుగులు పెడుతున్న ఒక చిన్నారి ఈ ఫొటోలో కనపడుతుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ‘ఫేస్ బుక్’ ఆ ఫొటోను బ్లాక్ చేసింది. ఆ తర్వాత ‘ఫేస్ బుక్’ నార్వే ప్రధానికి క్షమాపణలు చెబుతూ ఒక లేఖ రాసింది.