: చిన్నవయసులో పెద్దమనసు చాటిన చిన్నారి... సోషల్ మీడియాలో తనిప్పుడు సెలబ్రిటీ!
పెద్దమనసుతో ఓ చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో ఆమెను సెలబ్రిటీని చేసింది. ఆమె చేసిన గొప్ప కార్యాన్ని ఆమె తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, సుమారు 4 కోట్ల మంది వీక్షించడం విశేషం. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎల్లా అనే బాలిక తన తండ్రి ఎడ్డీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. రెస్టారెంట్ సందడిగా ఉంది. ఈ సందడిలో కుమార్తెకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చారు. తరువాత ఎల్లా అందర్నీ గమనిస్తూ కూర్చుంది. దీంతో కుమార్తె భావాలను బంధించేందుకు ఎడ్డీ వీడియో ఆన్ చేశాడు. ఇంతలో రెస్టారెంట్ అద్దాల నుంచి బయట వయసుడిగిన హోమ్ లెస్ వృద్ధుడు కనిపించాడు. రోడ్దు మీద ఎవరి పనిలో వారున్నారు. రెస్టారెంట్ లో ఎవరి హడావుడిలో వారున్నారు. ఇంతలో ఎల్లా ఆర్డర్ చేసిన ఆహారం వచ్చింది. బయట వున్న వృద్ధుడిని తండ్రికి చూపిస్తూ, 'డాడీ ఈ ఆహారం అతనికి ఇవ్వాలనుకుంటున్నాను' అని చెప్పింది. ఆ మాటలు విన్న తండ్రి.. కూతురు గొప్ప మనసుకు ఆశ్చర్యపోయి, వెంటనే ఆమెను ప్రోత్సహించాడు. 'ఓకే... వెళ్లి ఇవ్వ'మని చెప్పాడు. వెంటనే ప్లేటులోని ఆహారాన్ని తీసుకుని గబగబా వెళ్లి, అతనికి అందించింది. వణుకుతున్న చేతులతో ఆబగా అందుకున్న ఆ వృద్ధుడు ఆనందంగా తీసుకుని, ఆ చిన్నారికి థ్యాంక్స్ చెప్పి, తినడం మొదలెట్టాడు. ఎల్లా వచ్చి తండ్రి దగ్గర కూర్చుంది. అలా తాతకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల తనకు ఎంతో ఆనందంగా, తృప్తిగా వుందని చెప్పింది. చిన్నారిలోని దయాగుణాన్ని చూసిన ఆ తండ్రి తన కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఈ వీడియో ఎడ్డీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా సుమారు 42 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గుండెల్ని కదిలించావని, పాపను దీవిస్తున్నారు.