: ఏమాత్రం సిగ్గున్నా వెంకయ్య రాజీనామా చెయ్యాలి: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులపై మండిపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక సాయం పేరుతో ఇరువురు నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వెంకయ్య నాయుడుకు ఏమాత్రం సిగ్గున్నా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వెంకయ్య పోరాడాలని ఆయన పేర్కొన్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై పోరాడుతోంటే బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడం సరికాదని రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం ఏపీకీ కూడా బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీది కార్పోరేట్ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు.