: ఐదేళ్ల పాపను కిడ్నాప్ చేసి సైకిల్ పై తీసుకెళ్లిన పన్నెండేళ్ల బాలుడు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, కబీర్‌నగర్‌లో ఓ పన్నెండేళ్ల బాలుడు ఐదేళ్ల పాపను కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. ఆ ప్రాంతంలో నివసిస్తోన్న రామ్ కుమార్ సాహు కుమార్తె లాదు సాహు అనే పాప తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా ఒంటరిగా ఉండడాన్ని చూసిన ఆ బాల కిడ్నాపర్ పాపకు మాయమాటలు చెప్పాడు. చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టాడు. ఆ చిన్నారిని ఆడిస్తున్నట్లు నాటకమాడి, పాపపై ఓ టవల్ కప్పాడు. ఆ తరువాత సైకిల్‌పై ఎక్కించుకొని తీసుకునిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చిన్నారిని కొంతదూరం సైకిల్‌పై తీసుకెళ్లిన బాలుడు తరువాత పాపను సైకిల్ పై నుంచి దింపి పాపతో పాటు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాయ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు కిడ్నాపర్‌ల ముఠాకి చెందిన చిన్నారా? అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.