: ఈద్ సందేశంలో పాకిస్థాన్ ప్రధాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కశ్మీర్ ప్రజలను భారత్ చిత్రహింసలు పెడుతోందంటూ అభాండాలు!
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. పండుగ పూట కూడా కశ్మీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈద్ సందేశంలో భాతర్‌ను రెచ్చగొట్టేలా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈద్-ఉల్-అజాను కశ్మీరీల త్యాగాలకు అంకితమిస్తున్నట్లు ఈరోజు వ్యాఖ్యలు చేసి మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కశ్మీర్ అంశంపై పరిష్కారం దొరికేవరకు తమ దేశం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీరీల పోరాటంలో భాగంగా చేస్తోన్న బలిదానాలతో, త్యాగాలతో వారు తాము అనుకున్నది సాధించి చూపిస్తారని నవాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వాసుల పోరాటంలో ఫలితం వచ్చే వరకు తమ దేశం వారికి అండగా నిలుస్తుందని నవాజ్ షరీఫ్ అన్నారు. భారతదేశం నుంచి స్వేచ్ఛను సాధించడానికి కశ్మీరీలు తమ మూడోతరాన్ని సైతం పణంగా పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలను భారత్ చిత్రహింసలు పెడుతోందని, వాటిని కశ్మీరీలు అనుభవిస్తూనే పోరాటాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. స్వీయ నిర్ణయాధికారం వైపు కశ్మీరుల ఉద్యమం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలని భారత్ సైనిక బలగాల సాయంతో తొక్కేయకూడదని ఆయన హితవు పలికారు. పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం కారణంగా నష్టపోయిన కశ్మీరీలను తమ సోదరులుగా వర్ణించిన ఆయన, తమ దేశ ప్రజలు వారి త్యాగాలను మరచిపోకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. పాక్ వాసులు కశ్మీరీలకు అండగా ఉండాలని ఆయన సూచించారు. కశ్మీర్ ప్రజలు చేస్తోన్న త్యాగాలకు త్వరలోనే విజయం వరిస్తుందని అన్నారు. అక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే రోజులు ఆసన్నమయ్యాయని అన్నారు. మరోవైపు ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా ఈద్ ప్రార్థనల్లో పాల్గొని తమ వక్రబుద్ధిని వ్యక్తపరిచే వ్యాఖ్యలు చేశాడు. కశ్మీరీ ప్రజలు చేస్తోన్న పోరాటంలో విజయం సాధించాలంటూ ఆయన ప్రార్థనలు చేశాడు. అక్కడ మోహరింపజేసిన భారత్ బలగాలకు వ్యతిరేకంగా తన ప్రార్థనలు చేశాడు. కశ్మీర్ ప్రజలు భారత్ నుంచి స్వాతంత్ర్యం సాధించేలా పాకిస్థాన్ సర్కారు కృషి చేయాలని నవాజ్ షరీఫ్‌కు విన్నవించుకున్నాడు.