: ఔషధ రుచి చూసి కోమాలోకి వెళ్లిన వైద్యుడు.. తొమ్మిదేళ్ల తర్వాత మృతి
రోగికి రాసిచిన్న ఔషధాన్ని రుచి చూసి కోమాలోకి వెళ్లిపోయి తొమ్మిదేళ్లుగా అదే స్థితిలో ఉన్న ఓ వైద్యుడు సోమవారం మృతి చెందారు. కేరళలోని కొచ్చి సమీపంలోని పైప్రా గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు పీఏ బైజూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య డిస్పెన్సరీలో అధికారిగా పనిచేస్తున్నారు. 2007లో కీళ్ల నొప్పులతో బాధపడుతూ తన వద్దకు వచ్చిన ఓ మహిళకు బైజూ పరీక్షించి మందులు రాసిచ్చారు. దానిని వేసుకున్న ఆమె వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఆ తర్వాత కాసేపటికే లేచింది. ఇదే విషయాన్ని రోగి బంధువు బైజూకు తెలిపారు. తాను రాసిచ్చిన మందుల వల్ల ప్రమాదమేమీ ఉండదని చెబుతూ అదే మందును ఆయన తీసుకున్నారు. అంతే, అది నోట్లో పెట్టుకున్న వెంటనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. అలా తొమ్మిదేళ్లపాటు కోమాలో ఉన్న ఆయన సోమవారం మృతిచెందారు. అయితే రోగి భర్త వైద్యుడికి చూపించిన మందులో పురుగుల మందు కలిపి ఉండొచ్చనే అనుమానంతో ఆ దిశగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.