: భాగ్యనగరిలో భర్త పైశాచికత్వం!... హీటర్ ను ఎక్కువసేపు వాడిందని భార్యను వివస్త్రను చేసి కొట్టిన వైనం!


భర్తల వేధింపులు నానాటికీ శ్రుతి మించుతున్నాయి. వాటర్ హీటర్ ను ఎక్కువ సేపు వాడిందన్న చిన్న కారణాన్ని చూపిన ఓ హైదరాబాదీ భర్త తన భార్యను చితకబాదాడు. బాత్ రూంలో స్నానం చేస్తున్న భార్యను వివస్త్రగానే బయటకు లాక్కుని వచ్చిన ఆ భర్త చేసిన దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సైదాబాదులో నిన్న వెలుగుచూసిన ఈ ఘటన భర్తల పైశాచికత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. వివరాల్లోకెళితే... సైదాబాదుకు చెందిన మోహన్ తో నల్లగొండ జిల్లాకు చెందిన సుశ్రుతకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మోహన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సుశ్రుత గృహిణిగా ఉంటోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం స్నానం చేసేందుకు వేడి నీళ్లు పెట్టుకున్న సుశ్రుత వాటర్ హీటర్ కాస్తంత ఎక్కువ సేపు ఆన్ లో ఉంచింది. ఆ తర్వాత ఆమె స్నానానికి వెళ్లగా.. విషయం గ్రహించిన మోహన్... ఆమె స్నానం ముగియకముందే బాత్ రూంలోకి చొరబడ్డాడు. హీటర్ ను ఎక్కువసేపు ఎందుకు వాడావంటూ ఆమెపై అక్కడే చేయి చేసుకున్నాడు. పొరపాటైందని సుశ్రుత వేడుకున్నా వినని మోహన్ ఆమెను వివస్త్రగానే బయటకు లాక్కొచ్చాడు. అత్తామామలు, ఆడబిడ్డ, పిల్లల ముందుకు తనను వివస్త్రగా లాక్కొచ్చిన వైనంపై సుశ్రుత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన గదిలోకి వెళ్లిపోయిన ఆమె... తనకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు వివరిస్తూ వాట్సప్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశ్రుత వాట్సాప్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News